heart attack symptoms in telugu ఆకస్మిక మరణాలకు అసలు కారణాలు ఏమిటి?
How to Prevent Heart Attack పెళ్లి వేడుకలో అప్పటి వరకు బంధు, మిత్రులతో డ్యాన్స్ చేసిన వ్యక్తి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీంతో పెళ్లివేడుకలో విషాదం అలముకుంది. ఊళ్లో గణేష్ నిమజ్జనంలో డీజే సౌండ్ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నయువకుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే ప్రాణాలు విడిచాడు. ఆఫీసులో, జిమ్, స్కూల్లో ఎక్కడా చూసినా ఈ మధ్య ఇలాంటి వార్తలే. అప్పటివరకూ అందరితో చలాకీగా ఉండే వ్యక్తి హఠాత్తుగా ప్రాణం వదులుతున్నాడు. ఈ వార్త వింటేనే మనసువిస్మయంతో, బాధతో, భయంతో అల్లకల్లోలమవుతుంది. గతంలో అరుదుగా సంభవించే ఇలాంటి ఘటనలు.. ఇప్పుడు నిత్యం కనిపించడం ప్రజలను కలవరపెడుతోంది. అసలు ఈ ఆకస్మిక మరణాలు ఎలా సంభవిస్తాయి? ఎందుకు సంభవిస్తాయన్న అంశంపై కొన్ని విషయాలను తెలుసుకుందాం!
గుండె జబ్బులే ప్రధాన కారణం
ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న హఠాన్మరణానికి ప్రధాన కారణం గుండె జబ్బులే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుండె ఒక కండర సమూహం. అది నిరంతరం, సంకోచ వ్యాకోచాలు చెందుతూ (అంటే చిన్నగా, పెద్దగా అవుతూ) ఒక పంపు వలె పని చేస్తూ రక్తాన్ని ప్రవహింపజేస్తుంది. ఒకసారి అలా సంకోచ వ్యాకోచాలు చెందితే దాన్ని మనము ఒకసారి గుండె కొట్టుకుంది అంటాము. అలా ప్రతి నిమిషానికి గుండె సుమారుగా 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. ఇలా పంపు వలె పని చేసేందుకు, బయట ప్రపంచంలో పంపుల మాదిరిగానే, గుండెకు కూడా ఒక విద్యుత్ వ్యవస్థ ఉంటుంది. గుండెలో ఉన్న విద్యుత్ తీగల నుంచి సిగ్నల్స్కు అనుగుణంగా గుండె కండరాలు సంకోచ వ్యాకోచాలు చెందుతుంటాయి. ఈ విద్యుత్ తీగల్లో సిగ్నల్స్ ఏ కారణం చేతనైనా అందకపోతే గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొన్ని వ్యాధుల్లో ఈ విద్యుత్ తరంగాలు ఉత్పన్నం కావు, మరి కొన్ని సార్లు ఆ తరంగాలు గుండె కండరాల్లో సరిగా పయనించక గతి తప్పుతాయి, మరికొన్ని సార్లు అనేక తరంగాలు ఒకేసారి ఉవ్వెత్తున లేచి అస్తవ్యస్తంగా సిగ్నల్స్ ఉత్పన్నమై గుండె కంపిస్తుంది. ఇలాంటి సందర్భాలు అన్నింటిలోనూ గుండె కండరం పనిచేయదు. ఇలా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ లో లోపాలు ఉన్న వ్యాధులను ఎరిత్మియా అంటారు. ఎలెక్ట్రిక్ సిగ్నల్స్ అందక గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఆ స్థితిని ఎసిస్టోల్అంటారు.
గుండెలోని కింది గదులు అంటే జఠరికలు (వెంట్రికిల్స్) లో విద్యుత్ తరంగాలు ఒకేసారి ఉవ్వెతున్న అస్తవ్యస్తంగా లేచి కంపిస్తే ఆ స్థితిని వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ అంటారు. ఈ స్థితులలో అంటే కార్డియక్ అరెస్ట్అయ్యి గుండె సరిగా కొట్టుకోలేక రక్త ప్రసరణ స్తంభించి మరణం సంభవిస్తుంది. చాలా వ్యాధులలో, ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సరిగా ఉన్నప్పటికీ గుండె కండరం మరీ బలహీనంగా ఉన్నప్పుడు, తగినంత సంకోచించలేక రక్తాన్ని పంప్ చేయలేదు. ఈ పరిస్థితిని హార్ట్ ఫెయిల్యూర్ అంటాము. చాలా జబ్బులలో ఈ హార్ట్ ఫెయిల్యూర్, ఎరిత్మియా కలిసి ఉంటాయి. ఇక హార్ట్ ఎటాక్ అంటే, గుండెకు రక్తం సరఫరా చేసే రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టి, గుండెకు రక్త ప్రసరణ అందదు. అందువలన వారికి ఛాతినొప్పి వచ్చి, గుండె కండరంలో కొంత మేర పనిచేయదు. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు, దాని తీవ్రతను బట్టి, హార్ట్ బలహీనపడి ఫెయిల్ అవ్వడం వల్లకానీ లేదా ఎరిత్మియా వచ్చి కానీ మరణం సంభవించవచ్చు. ఇలాంటి దుష్పరిణామాలు హార్ట్ ఎటాక్ తీవ్రతను బట్టి, అందిన చికిత్సను బట్టి, వెంటనే కనబడవచ్చు లేదా కొన్ని రోజుల తర్వాత కనపడవచ్చు
ఆకస్మిక మరణాలకు కారణాలు ఇలా ఉండవచ్చు…
1. గతంలో గుండె జబ్బు లక్షణాలు కనిపించకుండా సడెన్గా హార్ట్ ఎటాక్ తో చనిపోవడం కొంత మందిలో హఠాన్మరణానికి ప్రధాన కారణం హార్ట్ ఎటాక్. ఇది వచ్చిన వారిలో సుమారు 20% మంది ఆకస్మికంగా వెంటనే క్షణాల్లో మరణిస్తారు. యువకులు, మధ్య వయసు వారిలో హఠాన్మరణానికి హార్ట్ ఎటాక్ ప్రధాన కారణం. అయితే దీని బారినపడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజూ క్రమబద్ధంగా వ్యాయామం చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. మధ్య మధ్యలో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. వంశంలో జబ్బులు అధికంగా ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇలా జాగ్రత్తగా జీవితం గడిపితే, హార్ట్ ఎటాక్, తద్వారా హఠాన్మరణం నుంచి బయటపడవచ్చు.
2. గతంలో గుండె జబ్బు ఉండి సడెన్ గా చనిపోవడం గతంలో గుండె జబ్బు ఉండి, గుండె మరీ బలహీనపడినప్పుడు సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ సంభవిస్తుంది. ఇలా హార్ట్ ఫెయిల్యూర్ అయినవారిలో, గతంలో హార్ట్ ఎటాక్ వచ్చిన వారిలో.. గుండెలోని విద్యుత్ తీగలు ముడిపడిపోయి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ సరిగా ప్రవహించవు. ఒక్కోసారి సిగ్నల్స్అ నూహ్యంగా ఉత్పన్నమై, వెంట్రిక్యులార్ ఫిబ్రిలేషన్ ( గుండె జఠరికలకు అస్తవ్యస్తమైన విద్యుత్ సంకేతాల కారణంగా వణికే ఒక తీవ్రమైన అసాధారణ గుండె లయ) జరిగి గుండె కొట్టుకోవడం స్తంభించిపోయి ఆకస్మిక మరణనికి దారి తీయవచ్చు. ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్ పేషంట్స్ కొందరికి డిఫిబ్రిల్లేటర్ అనే పరికరం ఉపయోగపడుతుంది. ఇది అసాధారణ గుండె లయను సరిచేయడానికి విద్యుత్ షాక్ ఇచ్చే వైద్య పరికరం. కార్డియాలజిస్ట్ సలహా మేరకు ఈ చికిత్స తీసుకోవచ్చు. ఈ ఉపకరణం సడెన్ డెత్ నుంచి కొంత వరకు కాపాడుతుంది. తీవ్రంగా హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న కొంత మంది పేషంట్స్ ఎసిస్టోల్తో గుండె ఆగిపోయి చనిపోతారు.
3. హార్ట్ ఎటాక్తో కాకుండా జన్యుపరమైనా కారణాలతో సడెన్గా చనిపోవడం కొంత మందికి జన్యుపరంగా సంక్రమించిన వ్యాధులలో, గుండెలో ఎలక్ట్రిక్సి గ్నల్స్ వ్యవస్థ సరిగా పనిచేయక సడెన్ గా చనిపోవచ్చు. ఈ జబ్బులు అరుదుగా ఉంటాయి. హైపర్ ట్రోఫిక్ కార్డియోమయోపతి ఇలాంటి జబ్బులలో ప్రధానం. ఈ వ్యాధిగ్రస్తులను, అలాంటి జబ్బులున్న కుటుంబాలను పరీక్షించి లేదా ఈ జబ్బులకు సంబంధించిన ఇతర లక్షణాలను బట్టి, ఇ.సి.జీ, ఎకో వంటి ఇతర పరీక్షలు నిర్వహించి, సరైన చికిత్స అందించి ఆకస్మిక మరణాన్ని ఆపవచ్చు . అందుకే గుండె సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టరును సంప్రదించి వారి సూచనలను పాటించడం వల్ల ప్రాణాపాయముప్పును తగ్గించుకోవచ్చు.
how to prevent heart attack


