Dengue Fever Causes Symptoms & Treatment

Dengue Fever Causes Symptoms & Treatment

diseases dengue fever

భయపెడుతున్న జ్వరం ఈ లక్షణాలతో ముందే గుర్తిద్దాం..

Dengue Fever Causes Symptoms & Treatment అసలే వానాకాలం.. కురిస్తే ఒకేసారి భారీ వర్షం.. తర్వాతి రోజు మళ్లీ ఎండ తీవ్రత.. లేదంటే 2,3 రోజుల పాటు ముసురు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొంది. దీంతో దోమల బెడద పెరగడంతో పాటు రకరకాల వైరస్లు విజృంభిస్తున్నాయి. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా డెంగ్యూ కలవరపెడుతోంది. పల్లెల్లో కంటే పట్టణాల్లోనే ఈ కేసులు ఎక్కువగా
వెలుగుచూస్తున్నాయి. ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో డెంగ్యూ, మలేరియా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అలాగే తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండలో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్యశాఖ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే జ్వరపీడితుల సంఖ్య గతం కంటే 2 నుంచి 3 రెట్లు పెరిగింది. ఆసుపత్రులకు రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని
హాస్పటల్స్ లో పడకల సంఖ్యను పెంచారు. ఈ వర్షాకాలంలో వ్యాపించే జ్వరాలు, వాటి లక్షణాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

టైఫాయిడ్ జ్వరం

కలుషిత నీరు, ఆహారం వల్ల టైఫాయిడ్ వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించాక వ్యాధి లక్షణాలు కనిపించడానికి రెండు మూడు వారాల సమయం పట్టవచ్చు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, రక్తంలో తెల్ల రక్తకణాలు తగ్గడం, విరేచనాలు, కడుపు నొప్పి, నీరసం, అలసట, గుండె
కొట్టుకునే వేగంలో మార్పులు, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే వ్యాధి తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది.

మలేరియా జ్వరం

ఇది ఆడ అనాఫిలిస్ దోమ కాటు వల్ల వస్తుంది. ప్లాస్మోడియం పరాన్నజీవి మలేరియాకు కారణమవుతుంది. మలేరియా బారిన పడితే అధిక జ్వరం, గొంతు మంట, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, కీళ్లనొప్పి, కండరాల నొప్పి, గ్రంథుల వాపు, మలంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి తీవ్రమైతే మూత్రపిండాల వైఫల్యం, కామెర్లు సోకే ప్రమాదం ఉంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే మలేరియా ప్రాణాంతకం కావొచ్చు.

చికెన్ గున్యా

ఎడిస్ ఈజిప్టై దోమ కుట్టడం వల్ల ఈ వైరస్ ప్రబలుతుంది. ఈ దోమను టైగర్ దోమ అని కూడా అంటారు. ఈ దోమలు ఎక్కువగా మురికి నీటిలో వృద్ధి చెందుతాయి. ఇవి కుట్టిన 3-7 రోజుల్లో వ్యక్తికి తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులు భరించలేకుండా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎప్పుడూ ఒళ్లంతా నొప్పులు ఉంటూనే ఉంటాయి. మరో వ్యక్తి సాయం లేనిదే కనీసం లేవడానికి కూడా ఓపిక ఉండదు. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చికెన్ గున్యాతో బాధపడుతున్నప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు తాగలేకపోతే.. సూప్స్, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. వేడి ఆహార
పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. చల్లని పదార్థాలు తీసుకోకూడదు. డాక్టర్ సూచనలను తప్పక పాటించాలి.

కలవర పెడుతున్న ‘డెంగ్యూ’

వానాకాలంలో వచ్చే జ్వరాల్లో ‘డెంగ్యూ’ చాలా ప్రమాదకరమైనది. దీన్ని ముందే గుర్తించి చికిత్స తీసుకుంటే తగ్గేదే అయినా.. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. త్వరగా ప్లేట్లెట్లు పడిపోవటం ఈ జ్వరంలో ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది. ఈ జ్వరం ఆడ ‘ఈజిప్టీ’ దోమ కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది.

‘డెంగ్యూ’ లక్షణాలు

‘డెంగ్యూ’ సోకిన తొలిదశలో ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, వాంతులు, వికారం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువగాఉంటాయి. ఆకలి తగ్గిపోతుంది . ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తమై డాక్టర్ను సంప్రదించడం మంచిది.

‘డెంగ్యూ’ తీవ్రమైతే కడుపు నొప్పి, ఆయాసం ఎక్కువగా ఉంటుంది. ఛాతిలో నీరు పోగవుతుంది. వాంతులు ఎక్కువగా అవుతుంటాయి. చిగుళ్ల నుంచి రక్తం వస్తుంది. చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు కనిపిస్తాయి. అలాగే బీపీ బాగా తగ్గిపోయి రోగి అపస్మారక స్థితికి
చేరుకునే ప్రమాదం ఉంది. కాళ్లు, చేతులు చల్లబడతాయి. నిస్సత్తువ, మగతగా ఉంటుంది. కాలేయం పరిమాణం పెరుగుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరగడంతో పాటు ప్లేట్లెట్లు వేగంగా పడిపోతాయి. రోగి పరిస్థితి విషమంగా మారుతుంది.

వీరికి ఎక్కువ ప్రమాదం

మధుమేహం, అధిక రక్తపోటు, అల్సర్లు, రక్తహీనత గల స్త్రీలతో పాటు గర్భిణులు, ఊబకాయులు, ఏడాది లోపు పిల్లలు, వృద్ధులకు డెంగ్యూ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది.
పైన పేర్కొన్నట్లుగా ఎవరిలోనైనా జ్వరం లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా డాక్టరును సంప్రదించండి.

జ్వరాలు – ఈ జాగ్రత్తలు తీసుకోండి
  • విష జ్వరాలకు కారణమవుతున్న దోమలు ఎక్కువగా నిల్వ ఉన్న నీటిలో పెరుగుతాయి. అందుకే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పాత డబ్బాలు వంటివాటిలో నీరు నిల్వ ఉంటే వెంటనే తీసేయాలి.
  • డెంగ్యూ దోమలు ఎక్కువగా పగలే చురుకుగా ఉంటాయి. అందుకే పగలు ఇంట్లో ఉండేటప్పుడు దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఇంటి తలుపులు, కిటికీల నుంచి దోమలు రాకుండా మెష్లు ఏర్పాటు చేసుకోవాలి. దోమ తెరలను ఉపయోగించాలి.
  • బయటకు వెళ్లినప్పుడు ఫుల్ హ్యాండ్స్ షర్టులు, టీషర్టులు, ఫుల్ ప్యాంట్లు, వీలైతే షూ ధరించాలి.
    కాళ్లూ, చేతులకు దోమలను కట్టడి చేసే క్రీములను రాసుకోవాలి. ఈ వర్షాకాలంలో 2,3 రోజుల పాటు విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉండటం, భరించలేని తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆస్పత్రికి
    వెళ్లాలి. అలాగే దోమల కట్టడికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *