పాదాలలో వచ్చే యాబెటిక్(షుగర్) నిర్లక్ష్యం చేయొద్దు!
diabetic footwear for men ప్రపంచంలో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్యల్లో డయాబెటిస్ (మధుమేహం) ఒకటి. డయాబెటిస్ ఉన్న వాళ్లలో దాదాపు సగం మందిని ప్రభావితం చేసే తీవ్రమైన ఇబ్బందుల్లో ‘డయాబెటిక్ ఫుట్’ ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల పాదాలలోని నరాలు, రక్త నాళాలు దెబ్బతింటున్నప్పుడు ఈ సమస్యలు వస్తాయి. ఒక్కోసారి
అవయవాలను కోల్పోయే పరిస్థితికి దారితీస్తుంది. అయితే సరైన అవగాహన, రోజువారీ సంరక్షణతో 85 శాతం మందిలో అవయవాలను కోల్పోకుండా కాపాడుకోవచ్చు.
పాదాలలో డయాబెటిక్ సమస్యలకు కారణాలు..
1. హై బ్లడ్ షుగర్(హైపర్గ్లైసీమియా): రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉండటం ఈ పాదాల సమస్యలకు ప్రధాన కారణం. ఇది శరీరాన్ని పలు రకాలుగా విధాలుగా దెబ్బతీస్తుంది.
2. నెర్వ్ డ్యామేజ్ (డయాబెటిక్ న్యూరోపతి) : హై బ్లడ్ షుగర్ వల్ల పాదాలలోని నరాలు నాశనమవుతాయి. దీనివల్ల స్పర్శ కోల్పోవడంతోపాటు నొప్పి, వేడి, చలిని అనుభవించలేరు. తద్వారా బొబ్బలు పుట్టినా, చర్మం కోసుకుపోయినా మనకు తెలియదు. దీనివల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
3. రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం: ఈ మధుమేహ వ్యాధి వల్ల రక్త నాళాలు దెబ్బతింటాయి. దీంతో పాదాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. తద్వారా గాయం నయం కావడం ఆలస్యమవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. పదేళ్లకు పైగా డయాబెటిస్తో బాధపడుతున్న వారు, 40 ఏళ్లు దాటిన పురుషులు, ధూమపానం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గతంలో పాదాలకు తగిలిన లోతైన గాయాలు ఉన్న వారిలో సమస్య తీవ్రత
ఎక్కువగా ఉంటుంది.
హెచ్చరిక సంకేతాలు.. లక్షణాలు
డయాబెటిక్ ఫుట్ సమస్యలు ఒకేసారి కాకుండా క్రమంగా వృద్ధి చెందుతాయి. తొలుత లక్షణాలు చాలా స్పల్పంగా ఉండొచ్చు. పాదాల్లో జలదరింపు, పిన్నులు, సూదులతో గుచ్చుతున్న అనుభూతి, మంట, స్పర్శ కోల్పోవడం, పాదాలకు చెమట పట్టకపోవడం, నడుస్తున్నప్పుడు కాళ్లు చల్లగా అయిపోవడం, తిమ్మిర్లు ఎక్కువగా ఉండటం, చర్మం నునుపుగా మారిపోవడం, పాదాలపై జుట్టు రాలిపోవడం, చిన్నగాయమైనా ఎక్కువ కాలం మానకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. గాయాల చుట్టూ ఎరుపు, వేడిగా ఉండటం, వాపు, చీము, దుర్వాసనతో కూడిన స్రావం, గాయం చుట్టూ చర్మం నల్లగా మారిపోవడంతోపాటు తరుచూ చలి, జ్వరం
వస్తుంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
కొన్ని అలవాట్లు మార్చుకోవాలి
డయాబెటిక్ ఫుట్ తీవ్రమైన సమస్యలను నివారించడానికి ముందస్తు సంరక్షణ చాలా ముఖ్యం. మీ పాదాలను రక్షించుకోవడానికి రోజువారీ అలవాట్లను మార్చుకోవాలి.
1. రోజూ పాదాలను చెక్ చేసుకోవడం: ప్రతిరోజు మీ పాదాలను అన్ని వైపులా క్షుణ్నంగా పరిశీలించాలి. కాలి వేళ్ల మధ్య, పైన, కింద, మడమలను చెక్ చేయాలి. పాదాల అడుగు భాగాన్ని చూడటానికి వీలుకాకపోతే కుటుంబసభ్యుల సాయం తీసుకోండి. కోతలు, బొబ్బలు, ఎరుపు, వాపు, లేదా చర్మం రంగులో మార్పులు ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లండి.
2. పాదాలను సరిగ్గా కడుక్కోవడం: రోజూ గోరు వెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి. ఎట్టిపరిస్థితుల్లో ఎక్కువ వేడిగా ఉండే నీటిని వాడొద్దు. శిశువుల చర్మానికి వాడే సున్నితమైన సబ్బులను ఉపయోగించాలి. మృదువైన, శుబ్రమైన క్లాత్ లేదా స్పాంజ్తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పొడి బట్టతో పాదాన్ని తుడుచుకోవాలి.
3. మాయిశ్చరైజింగ్: రోజూ పాదాలకు అన్ని దశల్లో మాయిశ్చరైజరు అప్లై చేసుకోవాలి. సున్నితంగా మర్దన చేసుకోవాలి. అదే సమయంలో కాలి వేళ్ల మధ్య మాయిశ్చరైజరు అలాగే ఉంచకూడదు. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల వచ్చే అవకాశం ఉంది.
4. గోళ్ల సంరక్షణ: గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. అదే సమయంలో లోతుగా కట్ చేసుకోవద్దు. మీరు సరిగ్గా కత్తిరించడం సాధ్యం కాకపోతే కుటుంబసభ్యులు లేదా పాడియాట్రిస్ట్ సహాయం తీసుకోండి.
5.సరైన పాదరక్షలు: గాయాలను నివారించడానికి, ఉన్న గాయాలు పెద్దవి కాకుండాఉండటానికి సరైన పాదరక్షలు అవసరం. మెత్తటి చెప్పులను ధరించండి. అలాగే మీకు సరిపోని, బిగుతుగా ఉండే షూలను అస్సలు వాడొద్దు. స్పర్శ లేనందున పాదాల నుంచి చెప్పులు పక్కకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా కాళ్లకు ఫిట్ అయ్యే వాటిని తీసుకోండి. ప్రతిరోజు శుభ్రమైన, పొడి, వదులైన సాక్స్ లను ధరించండి. రక్తస్రావం లేదా చీమును గుర్తించడానికి వీలయ్యే సాక్స్ ను వాడండి.
జీవనశైలిలో మార్పులు చేసుకోండి.
మీ డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుకోవడం అత్యంత ముఖ్యం.
- ఇందుకోసం రోజూ చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మందులు వేసుకోవాలి. రక్త ప్రసరణ మెరుగుదల కోసం మీరు కూర్చుకున్నప్పుడు పాదాలను కాస్త పైకి లేపి ఉంచాలి.
- రోజుకు 23 సార్లు 5 నిమిషాల పాటు కాలి వేళ్లను అటూఇటూ తిప్పండి. చీలమండలను పైకి కిందికి కదిలించండి.
- ధూమపానం మానేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజూ సున్నితమైన వ్యాయామాలు చేయాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. రక్తపోటు, కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుకోవాలి. చెప్పులు లేకుండా ఇంట్లో, బయటా ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దు.
వీటికి పూర్తిగా దూరంగా ఉండండి.
- వేడి నీటి బాటిళ్లు, హీటింగ్ పాడ్స్, ఎలక్ట్రిక్ బ్లాంకెట్లను ఉపయోగించొద్దు.
- పాదాలను ఎక్కువ సేపు నీటిలో ఉంచొద్దు.
- వైద్యుని సలహా లేకుండా యాంటీసెప్టిక్ క్రీములను వాడొద్దు.
- ముఖ్యంగా మీరు సొంతంగా పాదాలపై పుండ్లకు చికిత్స చేసుకోవద్దు.

