acidity of stomach
ఎసిడిటీని నిర్లక్ష్యం చేయొద్దు ఎలా తగ్గించుకోవచ్చు?
acidity symptoms ప్రతి ఒక్కరికి ఏదో ఒక దశలో ఎదురయ్యే సాధారణ సమస్యల్లో ఒకటి ఎసిడిటీ. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహజంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రోజూ దాదాపు 1.5 లీటర్ల
మేర ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక్కోసారి అధికంగా ఉత్పత్తి అయినప్పుడు కడుపు, ఛాతి, గొంతులో మంట, నొప్పి వస్తుంది. ఈ స్థితినే లేదా వైద్య భాషలో హైపర్ ఎసిడిటీ అని అంటారు. ఇది సాధారణమే అయినా నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక జీర్ణ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. ఎసిడిటీ సమస్యలు, నివారణ మార్గాలు, వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎసిడిటీకి కారణాలు
ఎసిడిటీకి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ప్రధానంగా 3 విభాగాలుగా విభజించవచ్చు
1. ఆహారపు అలవాట్లు 2. జీవనశైలి కారణాలు 3. వైద్యపరమైన కారణాలు
1. ఆహారపు అలవాట్లు:
ఎక్కువగా మసాలా, కారంగా ఉండే ఆహారం తినడం,వేయించిన నపదార్థాలు, జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తరచుగా తీసుకోవడం, కూల్ డ్రింక్స్ తాగడం, భోజనం చేసిన వెంటనే పడుకోవడం, ఎక్కువగా టీ, కాఫీ, సోడా తాగడం, మద్యపానం, ధూమపానం వంటివి ఎసిడిటీకి కారణమవుతాయి.
2,జీవనశైలి కారణాలు
రోజువారీ ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, సమయానికి భోజనం చేయకపోవడం రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేచి బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా చేయడం.
3,వైద్యపరమైన కారణాలు
acidity symptoms కొన్ని రకాల మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు
ఎసిడిటీ గురించి సంక్షిప్తంగా సాధారణంగా మనం పొద్దున 8 గంటలకు టిఫిన్, మధ్యాహ్నం 2 గంటలకు లంచ్, రాత్రి 8 గంటలకు డిన్నర్ చేస్తామనుకుందాం. ఆ సమయం కంటే 15
నుంచి 30 నిమిషాల ముందే మన మెదడు పొట్టకు ఒక ఆర్డర్ ఇస్తుంది. కాసేపట్లో ఆయన/ఆమె ఫుడ్ తినబోతున్నారు.. ఆ వచ్చే భోజనాన్ని జీర్ణం చేయడానికి యాసిడ్ రిలీజ్ చేసి రెడీగా ఉండు’ అని చెబుతుంది. దీనిప్రకారం ప్రతి భోజనం టైమ్ కంటే ముందే సుమారుగా ఒక అర లీటర్ యాసిడ్ ను పొట్ట రెడీ చేసుకుంటుంది. అయితే మనం ఫుడ్ తినడం ఆలస్యం
చేస్తే పొట్టలోకి వచ్చిన యాసిడికి జీర్ణం చేయడానికి భోజనం లేదు కాబట్టి చుట్టూ ఉన్న పొట్టగోడపై ప్రభావం చూపుతుంది. దీంతో వారికి పొట్ట పైభాగంలో మంట మొదలవుతుంది. ఎసిడిటీ వల్ల పొట్ట గోడపై ఎరుపు రంగు లేక చిన్న చిన్న కురుపులు వస్తాయి. చికిత్స తీసుకోకపోతే అల్సర్స్ వస్తాయి.
అలాగే ఆఫీస్ పని కావొచ్చు.. పిల్లల చదువు ఒత్తిడి, ఇతర రోజువారీ ఒత్తిడిని తట్టుకోలేని వారిలో కూడా ఎసిడిటీ లక్షణాలు కనిపిస్తాయి. మనకు జీర్ణాశయ గోడలపై ఒక రక్షణ పొర కవచంగా ఉంటుంది. ఒత్తిడి తట్టుకోలేని వారికి దీనిలో క్రమంగా క్రాక్స్ వస్తాయి. జీర్ణాశయంలో
విడుదలయ్యే యాసిడ్స్ వీటి వరకు వెళ్లి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మన ఫుడ్ పైప్ పొట్టతో కలిసినప్పుడు ఒక ‘one way valve’ లాంటి కండ ఉంటుంది. దీనివల్ల భోజనం ఫుడ్ పైప్ నుంచి జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఆ భోజనాన్ని తిరిగి ఫుడ్ పైపులోనికి వెళ్లకుండా ఈ కండ
అడ్డుపడుతుంది. ఒత్తిడి తట్టుకోలేనివారికి ఈ కండ తాత్కాలికంగా బలహీనపడి జీర్ణాశయంలోని యాసిడ్ ఛాతిలోకి వచ్చి అక్కడ మంటకు కారణమవుతుంది. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఇలాంటి ఎసిడిటీ సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు .ఎసిడిటీ లక్షణాలు ఛాతి, గొంతులో మంట, కడుపులో మంట, ఉబ్బరం, ఎక్కువగా పుల్లటి తేన్పులు రావడం, గొంతులో చేదుగా అనిపించడం, చిన్న వాంతి రావడం, ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, గొంతు నొప్పి, తరుచూ దగ్గు, కఫం, తలనొప్పి, రాత్రివేళల్లో ఛాతీలో మంటతో నిద్రలో ఇబ్బంది కలుగుతుంది.
ఇలాంటి లక్షణాలు ఎక్కువరోజులు కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. దాదాపు 90 శాతం ఎలాంటి టెస్టులు లేకుండానే ఎసిడిటీని గుర్తించవచ్చు. తప్పనిపరిస్థితుల్లో ఎండోస్కోపీ చేయించుకోవాల్సి ఉంటుంది.
ఎసిడిటీ నివారణ కోసం
- కారం, మసాలా పదార్థాలు, నూనె పదార్థాలు తగ్గించాలి. రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటలు గ్యాప్ ఇవ్వాలి.
- తాజా పండ్లు, కూరగాయలు, గ్రీన్ టీ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. నీటిని తగినంత మోతాదులో తాగాలి.
- ప్రతిరోజూ కనీసం అరగంట వ్యాయామం చేయాలి. యోగా, ప్రాణాయామం వంటి పద్ధతులు పాటించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.
- పొగ తాగే అలవాటు, మద్యం మానుకోవాలి. రాత్రి ఆలస్యంగా భోజనం చేయకుండా సమయానికి తినాలి. నిద్రకు కనీసం 7-8 గంటలు కేటాయించాలి. ఇవన్నీ పాటిస్తే దాదాపుగా ఎసిడిటీ
నివారించవచ్చు.
మనకు టిఫిన్, లంచ్, డిన్నర్ మధ్య కనీసం 6 గంటల గ్యాప్ ఉంటుంది. పగటి పూట ఈ మధ్యలో మనం ఏదో ఒకటి టైట్గా తీసుకుంటాం. కానీ రాత్రి భోజనం తర్వాత పొద్దున టిఫిన్ వరకు 12 గంటల పెద్ద గ్యాప్ ఉంటుంది. మధ్యలో నీళ్లు మాత్రమే తాగుతాం. అందుకే కొంత మందికి ఈ సమయంలో పొట్టలో యాసిడ్ నిండి తెల్లవారుజామున కడుపు నొప్పి వస్తుంది. అందుకే ఉదయం ఆలస్యం చేయకుండా టిఫిన్ తీసుకోవాలి.

