మలబద్ధం నివారించడం ఎలా?
constipation symptoms మలబద్ధకం నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం చాలా మంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ‘మలబద్ధకం’ ఒకటి. అయితే ఇది సాధారణ సమస్యే కదా అని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే మలబద్ధకం ఎక్కువ కాలంగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడి కలగడం, రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరగడం, పైల్స్, ఫిస్టులా ఇంకా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, గ్యాస్, ఆయాసం, దద్దుర్లు, వాంతులు, తేన్పులు వంటి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి.
మలబద్ధం సమస్య ఎందుకు వస్తుంది?
మలబద్ధకానికి కారణాలు మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ (పీచు పదార్థాలు) సరిపడినంత ఉండటం లేదు. అలాగే అవసరమైన మేరకు నీరు తాగకపోవడం, నిద్రలేమి, శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల ఆహారం సరిగా జీర్ణంకాక మలవిసర్జన సక్రమంగా జరగక మలబద్ధకం సమస్య తలెత్తుతోంది. అలాగే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండటం, మధుమేహం, జన్యు పరంగా పెద్దల నుంచే ఈ సమస్య రావడం, మహిళల్లో గర్భసంచి శస్త్రచికిత్స, పెద్దపేగు క్యాన్సర్, ఏదైనా శస్త్రచికిత్స (ప్రత్యేకంగా ఎముకలు, మెదడుకు సంబంధించినవి) తర్వాత, పొట్టకు సంబంధించిన శస్త్రచికిత్స తర్వాత ప్రేగులు అతుక్కుపోవటం వంటి కారణాల వల్ల కూడా మలబద్దకం సమస్య తలెత్తుతుంది.
మలబద్ధకం గురించి ఈ అపోహలు మానుకోండి
- మలం అంటేనే మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థం. అది రోజూ శరీరం నుంచి బయటకు పోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. చాలా మంది ఈ సమస్య ఉన్నప్పటికీ ఒకవేళ మందులు వాడితే ఆ మందులకు అలవాటు పడిపోతామని అపోహ పడుతుంటారు. అయితే సరైన మందులు వాడుతూ డాక్టర్లు సూచించిన ఆహారం తీసుకుంటే కొంతకాలానికి మందుల అవసరం లేకుండానే ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
- కొందరు తమకు పైల్స్ ఉండటం వల్ల మలబద్ధకం ఉందని అనుకుంటారు. కానీ నిజానికి మలబద్దకం వల్లే పైల్స్ వస్తాయి.
- ఉదయాన్నే లీటరు నీరు తాగితే విరేచనం సాఫీగా అవుతుందని కొందరు చెబుతారు. కానీ నిజానికి అది మలవిసర్జనకు కావాల్సిన ఒత్తిడిని మాత్రమే అందిస్తుంది. మనం ముందురోజు తీసుకున్న ఆహారం, నీరు మాత్రమే మలవిసర్జనను ప్రభావితం చేస్తుంది. మలబద్దకంతో బాధపడేవారు తమకు గ్యాస్ట్రిక్ సమస్య ఉందేమో అని ఆ మందులను వాడుతుంటారు. అయితే మలబద్ధకం వల్ల, పొట్టలో మలం పేరుకుపోయి, పొట్ట ఉబ్బరం లాగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం సమస్య తగ్గితే గ్యాస్ట్రిక్ సమస్య దానంతట అదే తగ్గుతుందంటున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
- మన శరీరానికి అవసరమైన మేరకు నీటిని తాగాలి. మనిషి బరువు, పొడవును బట్టి రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఒకేసారి లీటరు నీటిని తీసుకుంటే అది మూత్రంతో పాటు బయటకువచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు నీటిని తాగితే అది మనం తీసుకున్న ఆహారంలోని పీచుపదార్థంతో కలసి మలాన్ని పలుచగా చేసి సులువుగా బయటకు వచ్చేందుకు తోత్పడి మలబద్దకాన్ని నివారిస్తుంది.
- పీచు పదార్థం తోలుతో కూడిన కూరగాయలు, పండ్లు తినాలి. ఉదా: జామ, ద్రాక్ష, నారింజ, ఆపిల్, ఖర్జూరాలు, బెండకాయ, వంకాయ, చిక్కుడు, దొండకాయ వంటివి.
- రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇది మలబద్ధకం సమస్యను తగ్గించడంతో పాటు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. తగినంత నిద్ర కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది. రోజూ కనీసం 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలి.
- పప్పుతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. నాన్వెజ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు.
- ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం, స్వీట్స్, కూల్డ్రింక్స్, కృత్రిమ రంగులు, క్రీమ్స్ తయారు చేసిన రకరకాల ఆహార పదార్థాలు మలబద్దకం సమస్యను పెంచుతాయి. వీటికి దూరంగా ఉండాలి.
మలబద్ధకం – చికిత్స విధానం
50 ఏళ్ళు పైబడిన వారిలో మలబద్ధకం సమస్య మొదలైతే దాన్ని తేలికగా తీసుకోకుండా డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కొన్ని సార్లు పెద్దపేగు క్యాన్సర్ ఉన్నవారిలో మలబద్ధకం సమస్యతలెత్తవచ్చు. అందుకే డాక్టరు సూచనతో 50 ఏళ్లు దాటిన వారు కోలోనోస్కోపీ పరీక్ష చేయించుకుంటే క్యాన్సర్ని ముందే గుర్తించి జయించవచ్చు. మలవిసర్జన అవ్వక కొంత మంది బాత్రూమ్లోనే చాలాసేపు ఉండిపోయి ఇబ్బంది పడతారు. దీనిని అబ్స్ట్రక్టివ్ డేఫికేషన్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి వారికి బయో ఫీడ్ బ్యాక్ అనే చికిత్స అవసరం.
మలబద్దకం కట్టడికి ఇప్పుడు అనేక మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ సమస్య ఉంటే ఒకసారి తప్పనిసరిగా డాక్టరును కలవాలి. ఈ సమస్య ముదరకముందే తగిన వైద్యం తీసుకుంటే అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది.

